కంటి చూపు మెరుగుకై – పార్ట్ 5- ఫ్రూట్ పర్ఫైట్

ఎన్నో పండ్లు ఉండగా కంటి చూపు మెరుగవడం కోసం ఏమి తీసుకోవాలి అంటే, తప్పకుండా బొప్పాయి పండు తీసుకోవాలి. ఆరోగ్యాభిలాష ఉన్నవాళ్లు అయితే ఇలా నేను రాసింది చూసి తింటారు కానీ పిల్లలు మాత్రం తినరు. అందులో మా చిన్నబ్బాయి అసలు అరటి పండు తప్ప ఇంకేమి తినడు. ఇలాంటి మొండి ఘటాల కోసం నేను చాలా పుస్తకాలు, వెబ్సైట్లు తిరగేయ్యాల్సి వచ్చింది. ఆ సమయం లో చూసిన, చదివినవి అన్నీ క్రోడీకరించుకుని ఈ ఫ్రూట్ పర్ఫైట్ ని చేసాను.

ఇది నిజానికి ఒక ఫ్రెంచ్ వంటకం. వాళ్ళు ఇది గుడ్డు ఉపయోగించి చేస్తారు. నిదానం గా, వేగన్ వెర్షన్ ఆ తర్వాత శాఖాహార పర్ఫైట్ వచ్చాయి. పర్ఫైట్ అంటే పర్ఫెక్ట్ అని అర్థం అని గూగులమ్మ చెప్పింది. దీనిని 5 రకాల పదార్థాలు ఉపయోగించి 10 నిమిషాల్లో చెయ్యచ్చు. స్టవ్ మీద వండాల్సిన అవసరం లేదు. నేను చేసిన ఈ వంట లో రెండు రకాలుగా చేసాను. ఒకటి గ్రనోలా ఉపయోగించకుండా, ఒక మధుర పదార్థం లాగా. రెండోది గ్రనోలా ఉపయోగించి. రెండు రకాలుగా బాగా వచ్చింది.

నేను చేసిన ఈ వంటకాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి 3 రోజుల పాటు తినచ్చు. ముందు రోజే చేసుకొని, ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ లాగా తినచ్చు. స్వీట్ లాగా చేసిన వంటకాన్ని ఒక 5 గంటలు ఫ్రిడ్జ్ లో పెట్టి తర్వాత తింటే రుచి ఇంకా బాగుంటుంది. ఈ స్వీట్ ని పిల్లలు వదలకుండా తినేస్తారు. కాబట్టి నా వీడియో లో చూపించినట్టు చేసి మీ ఇంట్లోవాళ్లకు తినిపించండి.

ఈ వీడియో మీకు నచ్చినట్లైతే లైక్ చేసి షేర్ చెయ్యండి. ఇలాంటి మరిన్ని రాబోవు వంటల కొరకు నా ఛానల్ కు సబ్స్క్రయిబ్ అవ్వండి.

కంది పచ్చడి – అచ్చ బ్రాహ్మణ వంటలు

నా చిలగడ దుంప రోటి పచ్చడి వీడియో కి వచ్చిన స్పందన చూసి, మా పిన్ని అడిగింది కంది పచ్చడి తయారీ విధానం  కూడా వీడియో చెయ్యమని. ఇన్నాళ్టికి కుదిరింది. సాధారణం గా నేను ఇంట్లో చేసే వంటలని వీడియోలు తీసి పెడుతున్నాను. ఛానల్ కోసం ప్రత్యేకం గా ఏమి చెయ్యటం లేదు. కాకపోతే వీడియోలు ఎడిటింగ్, ఆడియో మిక్సింగ్ చెయ్యడం చాలా సమయం తీసుకుంటుంది.

ఇక కంది పచ్చడి విషయానికి వస్తే, మా చిన్నప్పుడు మా ఇంట్లో వారానికి ఒకసారైనా చేసేవాళ్ళు. మా ఇంట్లో రుబ్బురోలు చాలా రోజులు వాడుకలో ఉంది. మిక్సీ వున్నా కూడా, చాలా రోజుల పాటు ఈ రోలు లోనే పచ్చడి రుబ్బేది మా అమ్మ. అలా అయితేనే రుచి వస్తుంది అని మా అమ్మ నమ్మకం.

కంది పచ్చడికి కావాల్సినవి కంది పప్పు, ఎండు మిరపకాయలు మరియు ఉప్పు మాత్రమే. ఈ మూడింటితోనే రుచి వచ్చేస్తుంది. జీలకర్ర, ధనియాలు, చింతపండు ఇంకా ఏవేవో వేసి చేస్తున్నారు ఈ మధ్య మా బంధువులలోనే కొందరు. ఇవేమీ అక్కర్లేదు. ఈ పచ్చడి అన్నంలో కలిపి అందులో నెయ్యి వేసుకుంటే చాలు, ఇక అద్భుతః. చిన్న పిల్లలకు మింగడానికి సులభం గా ఉండటం కోసం కొంచం చారు లోనో లేక ముక్కల పులుసు లోనో అద్ది పెడతారు. మామూలుగా కంది పప్పు లో మాంసకృత్తులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అందులోనూ సులభం గా చేసుకోగలిగే వంటకం. అందుకని ఈ కింద వీడియో లో చూపించినట్టు చేసి మీ పిల్లలకి పెట్టండి. ఇష్టం గా తింటారు.

నా వీడియో మీకు నచినట్టైతే, లైక్ చేసి షేర్ చెయ్యండి. ఇలాంటి మరిన్ని వీడియోల కొరకు నా ఛానల్ కు సబ్స్క్రయిబ్ అవ్వండి. ధన్యవాదములు. __/\__

నా యూట్యూబ్ ఛానల్ పేరు: Aruna Gosukonda

ఛానల్ లింక్: https://www.youtube.com/channel/UCBQIYOT8bcJrgR7RkITseXg

 

 

కంటి చూపు మెరుగుకై … పార్ట్-4

కంటి చూపు మెరుగుకై … పార్ట్ 3 -అచ్చ బ్రాహ్మణ వంటలు

కంటి చూపు మెరుగుకై … – పార్ట్ 2 – అచ్చ బ్రాహ్మణ వంటలు

ఎర్ర గుమ్మడికాయ సాంబారు – (కంటి చూపు మెరుగుకై … పార్ట్ -1)

నా బ్లాగు చదువరులందరికి నమస్కారం. నా బ్లాగు టపాలు అన్నింటిలోనూ మొదటగా, గుత్తి వంకాయ కూరకి తర్వాత కంటి చూపు మెరుగుకై సిరీస్ కి ఎక్కువ వీక్షణలు వచ్చాయి. నా టపాలు ఆదరిస్తున్న అందరికి కృతజ్ఞతలు.

ఇవ్వాళ కంటి చూపు మెరుగుకై వాడాల్సిన నాలుగవ కూరగాయ గురుంచి తెలుసుకుందాం. నాలుగవది carrot. అమ్మయ్య ఇన్నాళ్లకు ఒప్పుకుంది అనుకుంటున్నారా. అవునండి. ఇదే నాలుగవది చివరది అయిన కూరగాయ. ఈ మాట వినగానే మీలాగే నాకు కూడా ఒక సందేహం వచ్చింది. మరి ముల్లంగి మాటేమిటి అని. మరి, మా డాక్టర్ గారు ముల్లంగి పేరు ఎత్తలేదు. అందుకని ఈ నాలుగు కూరగాయలు మాత్రం ఖచ్చితంగా ఇంట్లో ప్రతివారం తెప్పిస్తాను. ఆగండాగండి, ఇంతటితో అయిపోలేదు. ఇంకా పండ్లు, ఆకుకూరలలో ఏది మంచిది అన్నది కూడా వివరంగా చెప్పాల్సి ఉంది. అవి తర్వాత టపాలలో చెప్తాను.

ప్రస్తుతపు కూరగాయ విషయానికి వస్తే, carrot తో వంటలు ఏమి చెయ్యాలో నేను ఎవరికి చెప్పక్కర్లేదు. ఎందుకంటే అందరూ పచ్చిదే తినెయ్యగలరు కాబట్టి, ఒక్క మా పిల్లలు తప్ప. అయినప్పటికీ నా ఛానల్ లో కంటి చూపు మెరుగుకై సిరీస్ కింద మొదలు పెట్టిన వీడియోలని తుది వరకు తీసుకెళ్లడం కోసం, carrot తో పాటు ఇంకొన్ని కూరగాయలు కలిపి, ముక్కల పులుసు తయారు చేసే విధానం పెట్టాను.

సాధారణంగా ముక్కల పులుసు లో సొరకాయ, బెండకాయ, ఎర్ర గుమ్మడి కాయ, చిలగడదుంప, వంకాయ, carrot, మునక్కాయలు వేస్తారు. నేను ఇందులో మునక్కాయ, సొరకాయ, బెండకాయ వెయ్యలేదు. మీకు traditional మరియు authentic రుచి రావాలంటే ఇవి కూడా తప్పక కలపండి.

తయారీ విధానం మూడు రకాలుగా చెయ్యచ్చు. ముక్కలు చింతపండు పులుసు లో మగ్గాక పులుసు చిక్కబడటం కోసం,

1) కొంచం బియ్యంపిండి లో నీరు పోసి కలుపుకొని పులుసు లో వెయ్యడం.

2) రెండు పెద్ద చెంచాల కందిపప్పు ఉడకబెట్టి, పులుసులో కలుపుకోవడం.

3) 5 నుండి 6 రకాల దినుసులు వేయించి పొడి కొట్టుకుని, అది పులుసు లో కలపడం.

నేను నా వీడియో లో మూడవ పద్దతి లో చేసాను. కూరగాయలు ఏవి ఎంత తీసుకోవాలి దగ్గరనుండి, అవి ఎంత మందాన తరగాలి వరకు వివరించాను. పక్కా కొలతలతో నేను చెప్పినట్టు చేస్తే, మీకు కమ్మటి ముక్కల పులుసు చెయ్యడం వస్తుంది.

కాబట్టి నా వీడియో ని చూసి మీ ఇంట్లో తయారు చేసి, ఎలా వచ్చిందో నాకు నా బ్లాగులో కానీ, యూట్యూబ్ లో కానీ కామెంట్స్ సెక్షన్ లో చెప్పండి. మీకు నచ్చితే నా వీడియో ని లైక్ చేసి షేర్ చెయ్యండి. ఇలాంటి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ కొరకు నా ఛానల్ కు సబ్స్క్రయిబ్ అవ్వండి. ధన్యవాదములు. __/\__

నా యూట్యూబ్ ఛానల్ పేరు: Aruna Gosukonda

లింక్: https://youtu.be/jBZbNBn-zm0

20200612_142605

ఫ్రూట్ పంచ్ – ఫ్రూట్ జ్యూస్

నా ఛానల్ లో ఇప్పటివరకు ఫ్రూట్ జ్యూస్ పెట్టలేదు. అందుకని, ఈ జ్యూస్ తయారీ విధానం పెట్టాను. మామూలుగా జ్యూసర్ లో వేసి జ్యూస్ తియ్యడమే అయితే కాదు. ఇంకా చాలా సొబగులు అద్దాలి. అది ఏమిటి, ఎలా చేయాలి అన్నది నా ఛానల్ లో చూసి తెలుసుకోవచ్చు.

నా యూట్యూబ్ ఛానల్ పేరు: Aruna Gosukonda

ఛానల్ లింక్:

https://www.youtube.com/channel/UCBQIYOT8bcJrgR7RkITseXg

ఇలాంటి మరిన్ని రాబోవు వీడియోస్ కొరకు నా ఛానల్ కు సబ్స్క్రయిబ్ చేసుకోండి. ధన్యవాదములు. __/\__

 

PSX_20200611_180937

Black lives matter

ఈ మధ్య టీవీ లో చాలా ఎక్కువగా కవర్ అవుతోంది ఇది. నేను అసలు ఏమి జరిగింది, ఎవరిది తప్పు అన్న విషయం మీద చర్చించటం లేదు. నల్లవాళ్ళ జీవితాలు కూడా అమూల్యమైనవే అనే caption ఒకటే నేను చర్చించవలసింది. ఎందుకంటే నేను కూడా తెల్లగా ఉండను కాబట్టి.

నేను మా ఇంట్లో రెండో దాన్ని. ఇంట్లో అందరిలోకి చిన్నదాన్ని. నాకు ఒక అన్నయ్య. నాకు బాగా తెలిసిన ఇద్దరు అమ్మాయిలని గమనించి రాస్తున్నాను.  పుట్టింట్లో, అత్తారింట్లో అన్నయ్య బూచి చూపించి అందరిని బాగా తొక్కి బెట్టి ఆడింది ఆట, పాడింది పాట గా బతికేసారు. వాళ్ళు ఏమి చేసినా వత్తాసు పలికే అన్నయ్యలు వీళ్ళకి. నేను అలా ఉంటే ఇక్కడ ఈ టపా ఎందుకు రాస్తాను.

పేరు గుర్తులేని ఒక జాకీచాన్ సినిమా లో, నువ్వు మంచివాడివి అవ్వడం వల్ల నేను చెడ్డవాడిని అయ్యాను. లేదంటే నేను కూడా మంచివాడినే అంటాడు. చాలా అసందర్భం గా అనిపిస్తుంది. కానీ ఇదే మన సమాజం లో జరిగేది. ప్రతిదానికి comparision. ఒక 95 మార్కులు తెచ్చుకుంటే, అభినందించాల్సింది పోయి, అబ్బే నీకంటే శుంఠలు వున్నారు కాబట్టి నీకు అన్ని మార్కులు వచ్చాయి. అబ్బే, ఫలానా వాళ్ళకి జిల్లా మొత్తానికి మొదటి రాంక్ వచ్చింది ఎప్పుడో పురాతన కాలం లో. అబ్బే అసలు బట్టీ పట్టి రాసేవాళ్ళ వల్లే ఈ విద్యా వ్యవస్థ ఇలా తగలాడింది. ఇన్ని మాటలు వస్తాయి. అదే దేవుడి దయ వల్ల తెల్లగా పుట్టిన వాళ్ళు ఎవరైనా, కాస్త కష్టపడి ఒక 80 మార్కులు తెచ్చుకుంటే చాలు, ఇహ ప్రపంచం లో వాళ్ళని మించిన వాళ్ళు లేరు. వాళ్లంత కష్టపడ్డ వాళ్ళు లేరు. అసలు వాళ్ళు భూమి మీద పుట్టడం వల్ల ఈ ప్రపంచం అంతా ఈ మాత్రంగా ఉంది అనేస్తారు. ఎంత ఘోరం. ఈ అన్యాయం తట్టుకోక, ఇదేమిటి అని అడిగితే చెడ్డవాళ్ళు. ప్రతి ఒక్కరు ఇచ్చే attention ని ఎంజాయ్ చేస్తూ ఏమి మాట్లాడకుండా వుండే తెల్లటి వాళ్ళు మంచి వాళ్ళు. మరి ఇంతటి మంచి వాళ్ళు ఉంటే, ప్రశ్నించే వాడు చెడ్డవాడే గా.

ఇక్కడ మంచివాడు మా అన్నయ్య. ఇక చెప్పేది ఏముంది,  Automatic గా నేను చెడ్డదాన్ని. పుట్టి బుద్ధి ఎరిగినప్పటి నుండి వర్ణ వివక్ష, లింగ వివక్ష బాగా ఎదుర్కొన్నాను. నాకు కాస్త ఉపశమనం స్కూల్, కాలేజ్ లోనే. మీ అన్నయ్యతో పోల్చుకోకుండా చూస్తే నువ్వు తెలుపు అంటూ నా స్నేహితులు నాకు వెన్ను తట్టేవారు. నేను పెద్దగా పట్టించుకోకపోయినా కాస్త బాగుండేది వినడానికి. కానీ ఒకటే తీర్మానించుకున్నా, నాకంటూ గుర్తింపు నా ఒంటి రంగుతో తెచ్చుకోకూడదు అని. ఆ క్రమం లోనే కష్ట పడి అనుకున్నది సాధించడం లో వుండే ఆనందం తెలుసుకున్నాను. అదే సమయం లో, నాలాగే ఆలోచించే ఎంతో మందిని చూసాను. తెల్ల తోలుతో పాటు, మంచి మనసు ఉన్నవాళ్ళని కూడా చూసాను. ఈ పరిణామ క్రమంలో ఒకటి అర్ధం అయ్యింది. తెల్లతోలు అనేది దేవుడు ప్రసాదించింది, మనం సాదించాల్సింది వేరే ఉంది అనుకున్న వాళ్ళు, నిజం గానే భూమాత ప్రపంచానికి ఇఛ్చిన వరాలు. ఇలాంటి వాళ్ళని చూసి, నిరహంకారం గా ఎలా ఉండాలో నేర్చుకున్నాను. ఇంతా అయ్యాక నా కథ లో మెయిన్ కారెక్టర్ అయిన మా అన్నయ్య, పెద్ద అయ్యాక తెల్ల తోలు కోసం చూడకుండా చక్కగా తనకి నచ్చిన అమ్మాయిని చేసుకున్నాడు. ఆ అమ్మాయి ని ప్రేమ గా చూసుకుంటున్నాడు. మా అన్నయ్య పెళ్లి సమయం లో వాళ్ళ జంట ని చూసి కాకి ముక్కుకు దొండపండు అని వెక్కిరించిన వాళ్ళని, తోలు రంగు చూడటానికి మనం ఏమన్నా కసాయి వాళ్ళమా అని ఘాటుగా సమాధానం ఇచ్చాడు.

ఇప్పుడు అసలు black lives matter  అవునా కాదా అంటే, అవును. బ్లాక్, వైట్ అని లేకుండా అందరి lives అమూల్యమైనవే. అన్యాయం ఎక్కడ జరిగినా అన్యాయమే. అది వెంటనే ఖండించాల్సిందే. అందులోనూ, వివక్ష తో చేస్తే అసలు సహించకూడదు.

లైఫ్ ఎవరికైనా ఒకటే, ఫీలింగ్స్ అందరికీ ఒకటే, నొప్పి అందరికీ ఒకటే, డబ్బు అందరికీ ఒకటే, న్యాయం అందరికీ ఒకటే. ధర్మ సూక్ష్మం తెలుకుని ప్రవర్తిస్తే అందరి జీవితాలు బాగుంటాయి. బాగుండాలి.

సర్వే జనా సుఖినో భవంతు.

గమనిక: ఈ సారి ఒకటికి రెండు సార్లు నేను రాసింది సరి చూసుకుని టపా బ్లాగు లో వేస్తాను. నేను టపా publish చేసాక, ఎడిటింగ్ చెయ్యడం వల్ల, ఎవరి బ్లాగులు అయితే మాలిక అగ్రిగ్రేటర్ లో వెనక్కు వెళ్ళాయో వాళ్ళకి నా క్షమాపణలు.

కంటి చూపు మెరుగుకై … పార్ట్ 3 -అచ్చ బ్రాహ్మణ వంటలు

హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అరుణ గోసుకొండ. అయ్యో,, ఇదేంటి ఇక్కడ కూడా ఇదే చెప్తున్నాను. ఏమిటో ఈ ఛానల్ గొడవలో పడి ఎక్కడ చిన్న అవకాశం వచ్చినా, బాగా నా ఛానల్ గురుంచి నేనే డప్పు కొట్టుకోవడం ఎక్కువ అయ్యింది. ఈ డప్పు కి ప్రమోషన్ ఆక్టివిటీస్ అని గొప్పగా పేరు ఒకటి. నాలాంటి చిన్న చితకా వాళ్ళని బాగా నిలవరించడం కోసం యూట్యూబ్ పెద్దలు బానే పధకం వేశారు. కొత్త నియమావళి ప్రకారం, 1000 మంది subscribers మరియు 4000 గంటల వీక్షణం ఉంటే గాని ఛానల్ ని monetize చెయ్యనివ్వరు అంట. ఒక సారి మొదలు పెట్టాక వెనక్కి తగ్గడం ఎందుకు అని నేను కూడా నా వంతు ప్రయత్నాలు మొదలు పెట్టాను. అందులో భాగం గానే, ఎక్కడ వీలు చిక్కితే అక్కడ నా ఛానల్ కి సబ్స్క్రయిబ్ చేసుకొమ్మని అడుగుతున్నాను. ఇక్కడ కూడా, నా బ్లాగు చదువరులకు విజ్ఞప్తి. మీకు నా ఛానల్ లో వీడియోలు నచ్చినట్లైతే, నా ఛానల్ కు సబ్స్క్రయిబ్ చేసుకొని, ఆ పక్కనే ఉన్న గంట బొమ్మ ని press చెయ్యండి. నా ఛానల్ లో కొత్త వీడియో నేను అప్లోడ్ చేసిన వెంటనే, మీకు  notification వస్తుంది.

ఇక మన కంటి చూపు మెరుగుకై సిరీస్ లోకి వచ్చేద్దాం. కంటి చూపు బాగా ఉండాలి అంటే మన ఆహారం లో మనం తప్పక తీసుకోవాల్సిన ఇంకో కూరగాయ బీట్ రూట్. అంతేనా, బీట్ రూటా అని తీసిపారేయ్యకండి. దీని వల్ల ప్రయోజనాలు చాలా వున్నాయి. సాధారణంగా లో బీపీ మరియు అనీమియా(రక్తం తక్కువ గా ఉండటం) తో బాధ పడేవారికి ఇది ఉపయోగకారి. గర్భంతో ఉన్నవారు బిడ్డ మంచి రంగు రావడం కోసం బీట్ రూట్ తినడం, బీట్ రూట్ జ్యూస్ తాగడం నేను గమనించాను. ఇప్పుడు కంటి ఆరోగ్యం కోసం కూడా మంచిది అని తెలిసింది కాబట్టి, ఈ కూరగాయ ని మీ వంటల్లో తరుచు గా వాడండి.

ఇక వండే విధానంకి వస్తే, మాములుగా కొబ్బరి వేసి చేసినా లేక తురుము కూర చేసి నిమ్మ రసం పిండినా వాసన కొంచం ఘాటు గా ఉంటుంది కాబట్టి పిల్లలు విముఖత చూపుతారు. అలా అని ప్రతిసారి హల్వా చేసి పెట్టలేము. స్వీట్ ఎక్కువ అలవాటు చెయ్యడం మంచిది కాదు పిల్లలకి. అందుకు మళ్ళీ నేను రీసెర్చ్ మొదలు పెట్టాను. చివరికి అచ్చ బ్రాహ్మణ పద్దతి లో ఉల్లి, వెల్లుల్లి వాడకుండా కూడా రుచి తెప్పించే మార్గం కనుక్కున్నాను. అది ఉడిపి వారు తయారు చేసే బీట్ రూట్ గ్రేవీ కూర. ఇది నేను కూడా ఒక బ్లాగు లో చూసి తెల్సున్నాను. మసాలా కి కొలతలు మాత్రం మా ఇంటి వంటల కి తగ్గట్టు మార్చేసుకున్నాను. ఏది ఏమైనా, ఈ దక్షిణ కన్నడ ప్రాంతం వాళ్ళు కొబ్బరి మరియు ధనియాలు తెగ వాడుతారు. ఈ రెండు మాత్రమే కాదండోయ్, ఇంకా దినుసులు ఉన్నాయి మసాలాకి. మరి అవేంటి, ఎలా వండాలి అన్నది, నా యూట్యూబ్ వీడియో లో చూసేయ్యండి.

నా యూట్యూబ్ ఛానల్ పేరు : Aruna Gosukonda

మీకు, నా వీడియో నచ్చినట్లైతే లైక్ చేసి షేర్ చెయ్యండి. నా ఛానల్ కు సబ్స్క్రయిబ్ అవ్వండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను, నాకు బ్లాగు లో కానీ, లేదా యూట్యూబ్ లో కానీ కామెంట్స్ సెక్షన్ లో తెలియచెయ్యండి.

గుత్తి వంకాయ (డ్రై) – అచ్చ బ్రాహ్మణ వంటలు

20200523_130012

గుత్తి వంకాయ గురుంచి మన ఆంధ్రులకు నేను కొత్తగా చెప్పేదేం లేదండి. కాకపోతే గ్రేవీ కి, డ్రై వెర్షన్ కి తేడా ఏమిటి అంటే, ఇందులో వంకాయ ని నాలుగు పక్షాలు గా చీల్చకుండా మధ్యలో మూడు వైపులా గాట్లు పెట్టి పొడి కూరతారు. అందులోనూ ఈ వంటకానికి వంగపువ్వు రంగులో వుండే, సన్నటి, పొడవాటి వంకాయలు మాత్రమే వాడతారు. మిగిలిన వాటితో అంత రుచి రాదు. ఈ రకం వంకాయలని ఏమని పిలుస్తారో నాకు తెలియదు. మీలో ఎవరికి అయినా తెలిస్తే కామెంట్స్ సెక్షన్ లో తెలియ చెయ్యండి.

ఇక పోతే నా ఇతర భాషా స్నేహితులకి ఇటువంటి వంట (డ్రై వెర్షన్) ఒకటి మన వైపు చేస్తారని తెలియదు. అందుకోసం ఇది వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టాను. ఎలాగూ వీడియో పెట్టాను కదా అని ఇక్కడ బ్లాగు ద్వారా నా బ్లాగ్ చదువరులకు తెలియజేస్తున్నాను.

ఒకవేళ తయారీ విధానం తెలుసుకోదల్చుకుంటే, నా యూట్యూబ్ ఛానల్ Aruna Gosukonda లో చూడండి. ఇలాంటి మరిన్ని రాబోవు వీడియో ల గురుంచి తెలుసుకునేందుకు, నా ఛానల్ కి సబ్స్క్రయిబ్ అవ్వండి.

 

కంటి చూపు మెరుగుకై … – పార్ట్ 2 – అచ్చ బ్రాహ్మణ వంటలు

మొదటగా, బ్లాగు పోస్టు ఆలస్యం చేసినందుకు క్షమించాలి. మా వారు ఆఫీస్ కి వెళ్లడం మొదలు పెట్టారు. ఇంటిలో పని ఒత్తిడి ఎక్కువ అయ్యి, బ్లాగు రాయడం, వీడియోలు సవరణ చెయ్యడం కుదర లేదు. హ హ…అవునండి బాగానే ఊహించారు. మా వారు లాక్ డౌన్ సమయం లో ఇంట్లో బాగా సహాయం చేసారు నాకు. ఇప్పుడు ఆ అవకాశం లేదు.

సరే, మన కంటి చూపు మెరుగుకై సిరీస్ లోకి వచ్చేద్దాం. కంటి ఆరోగ్యం కోసం వాడవలసిన కూరగాయల్లో రెండవది, చిలగడ దుంప. దీనినే కొన్ని చోట్ల గెనిసి గడ్డ అంటారు. ఒకప్పుడు అందరూ సాంప్రదాయ వంటలలో బాగా వాడేవాళ్లు. బంగాళా దుంప హవా పెరిగాక ఇది చాలా వరకు మరుగున పడింది అని చెప్పాలి.

ఇక దీనిని ఎలా వాడుకోవాలి అంటే, చాలా సులభమైన పద్ధతి ఉడక బెట్టుకుని, చల్లారాక తొక్క తీసి తినడం. తియ్య గా వుంటుంది. మరి ఒక  సులువైన పద్ధతి, నిప్పుల మీద కాల్చి ఆ తరువాత చల్లారాక, నల్లబడిన తొక్క ని వొలిచేసి తినడం. నిప్పుల మీద కాల్చిన పద్ధతి లో చాలా రుచి గా ఉంటుంది. మా చిన్నప్పుడు, రెండవ సిలిండర్ లేని కారణం గా, కుంపటి మరియు కిర్సనాయిలు స్టవ్ ఇంట్లో చాలా రోజులు వాడుక లో ఉన్నాయి. నేను 9వ తరగతి కి వచ్చే సమయానికి కుంపటి వాడకం, స్టవ్ వాడకం మానేసారు ఇంట్లో. ఇప్పటి గ్యాస్ స్టవ్ ల మీద కాలిస్తే, సరిగ్గా కాలవు సరి కదా రుచి కూడా రాదు.

మరి ఇప్పుడు ఏమి చెయ్యాలి అంటే, మన తరహా లో వండి వడ్డించెయ్యడమే. సులువు గా, రుచి గా చేసుకోగలిగిన వంటకం చిలగడ దుంప రోటి పచ్చడి. తక్కువ నూనె తో చెయ్యాలి అంటే ఎలాంటి కిటుకు ఉపయోగించాలో, ఈ కింద వీడియో లో విధానం ఇచ్చాను. నేను ఉల్లి, వెల్లుల్లి లేకుండా చేస్తున్నాను. కాబట్టి, అచ్చ బ్రాహ్మణ వంటలు అని ట్యాగ్ లైన్ పెట్టాను.

నా వీడియో చూసి, ఇంట్లో ప్రయత్నించి, నచ్చితే లైక్ చేసి షేర్ చెయ్యండి. ఇలాంటి మరిన్ని వీడియో ల కోసం నా ఛానల్ కు సబ్స్క్రయిబ్ అవ్వండి.

వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ సోయా సాస్, గరం మసాలా లేకుండా – రెస్టారెంట్ లో లాగా

ఫ్రైడ్ రైస్ అంటే ఒకప్పుడు చాలా ఈజీగా చేసే వంటకం. రెండు, మూడు రకాల కూరగాయల్ని వేయించి అందులో కొంత సోయా సాస్ వేసేసి, ఉప్పు, మిరియాలపొడి, అన్నము కలిపితే చాలు. మరి సోయా సాస్ వాడటం చాలా మందికి ఇష్టం ఉండటం లేదు, కారణాలు ఏమైతేనేం.

అలాంటప్పుడు, ఈ సోయా సాస్ ని ఎలా తప్పించాలా, రుచి ఎలా రాబట్టాలా అని కొన్ని ప్రయోగాలు చేసాను. బ్లాగులు చదివాను. వీడియోలు చూసాను. ఈ మధ్య గూగుల్ ఫీడ్ లో ఒక వార్తా చదివాను. మొత్తం మీద నాకు అర్ధం అయ్యింది ఏమిటి అంటే, జపాన్ వాళ్ళు మన షడ్రుచుల్ని ఒప్పుకోరు. వాళ్ళకి నాలుగే రుచులు ఉన్నాయి. తీపి, పులుపు, ఉప్పు, చేదు. ఈ మధ్యనే అంటే ముప్పై ఏళ్ల కింద umami అనే రుచి ని కనిపెట్టారు. ఇది సోయా సాస్ లో ఎక్కువ ఉంటుంది అని డిసైడ్ చేశారు. ఇదే రుచి టొమాటో లలో కూడా ఉంటుంది అని డిసైడ్ చేశారు. బహుశా ఇదే మన వగరు ఏమో. ఏదైతేనేమి, సోయా సాస్ కి ప్రత్యామ్నాయం కావాలి అనుకున్న నాకు ఒక దారి దొరికింది. టొమాటోలు తీసుకొని అందులో కొన్ని మసాలా దినుసులు కలిపితే సోయా సాస్కి కొంచం అటు ఇటు గా ఉన్న రుచి వస్తుంది. చివర్లో మిరియాల పొడి చల్లినప్పుడు, అసలుకి మన వంటకానికి చైనీస్ రెస్టారెంట్ లో ఫ్రైడ్ రైస్ తిన్న రుచి వచ్చేస్తుంది.

ఇంకో విషయం చెప్పాలి. మనవాళ్ళు coconut amino sauce అని ఒక ప్రత్యామ్నాయం కనిపెట్టారు సోయా సాస్ కి. రివ్యూలని బట్టి ఇది కూడా ఒక ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం అనిపించింది. కానీ ఇది దొరకడం కష్టం. కాబట్టి, నేను చెప్పిన విధంగా చేసి ఇంట్లోనే రెస్టారెంట్ రుచి తెప్పించెయ్యండి.

నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చెయ్యండి. మరిన్ని వీడియోల కొరకు నా ఛానల్ కి సబ్స్క్రయిబ్ అవ్వండి.

ఎర్ర గుమ్మడికాయ సాంబారు – (కంటి చూపు మెరుగుకై … పార్ట్ -1)

ఈ కరోనా వెళ్లేంతవరకు మనకు, మన పిల్లలకు టాబ్స్, మొబైల్స్ మరియు లాప్టాప్ ల వినియోగం తప్పనిసరి అయి కూర్చుంది. ఇప్పటికే కళ్ళజోడు ఉన్న మా పెద్దాడికి ఇంకా పవర్ పెరుగుతుంది ఏమో అని భయం వేసి, వాడికి రకరకాలుగా కళ్ళ కి మంచివి అని తెల్సిన కూరగాయల్ని భోజనం లో ఇవ్వటం మొదలు పెట్టాను.

అసలు కళ్ళకి మంచివి అయిన కూరగాయలు ఎలా తెలిశాయి అంటే, అది కూడా మా పెద్దాడికి కళ్ళ జోడు వాడాల్సి వచ్చినప్పుడు తెలిసింది. ఇక్కడ బెంగుళూరు లో అరవింద షెనాయ్ అనే ఒక చిన్న పిల్లల వైద్యుడు వున్నారు. ఆయన ఎంత ఫేమస్ అంటే, తిరుపతి వెంకన్న దర్శనం అయినా త్వరగా దొరుకుతుంది ఏమో కాని, ఈ డాక్టర్ గారి అపోయింట్మెంట్ మాత్రం ఒక పట్టాన దొరకదు. ఇక మా పెద్దబ్బాయి కి కళ్ళజోడు వచ్చాక, ఈయన ను కలిసి, తినే తిండి లో ఏమైనా మార్పులు చెయ్యాలా పిల్లల కోసం అని ఆరాలు తీసాను. అసలే శాఖాహారులము అని కూడా చెప్పాను. అప్పుడు ఆయన సూచించిన కూరగాయల ని గుర్తు పెట్టుకొని, మా పిల్లల అభిరుచి కి తగినట్టు గా వంటలు చెయ్యడం మొదలు పెట్టాను. ఆ డాక్టర్ గారు సూచించిన కూరగాయలలో మొదటిది ఎర్ర గుమ్మడికాయ.

ఎర్ర గుమ్మడికాయ నే కొన్ని ప్రాంతాలలో సూర్య గుమ్మడికాయ అని కూడా అంటారు. ఇంకా చెప్పాలి అంటే, దీనిని ఒక పండు లాగా చూస్తారు. ఆడవాళ్లు పదహారు ఫలాలు నోము లో దీన్ని ఒక ఫలం గా ఇస్తారు. ఇక dieticians సూచనల మేరకు ఇది ఒక సూపర్ ఫుడ్. ఇందులో అన్ని రకాల విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. అందులోనూ A విటమిన్ ఎక్కువగా ఉంటుంది.

మరి ఇంకా ఎందుకు ఆలస్యం. ఇంటిలో ఇది తెచ్చుకుని వన్డేద్దాం అని తెచ్చాను. కానీ ఎర్ర గుమ్మడికాయ తో అంత ఈజీ కాదు అని అర్ధం అయ్యింది. కొంచం తీపి వుండే ఈ కాయగూర ని షరా మామూలుగా వాడితే ఈ తీపి వల్ల రుచి కుదరదు. అందుకని, ఈ కూరగాయ కోసం ప్రత్యేకించి చేసే వంటకాలు నేర్చుకున్నాను. “అభ్యాసం కూసు విద్య” అన్నారు పెద్దలు. చెయ్యగా, చెయ్యగా  ఎర్ర గుమ్మడితో వంటలు పట్టు బడ్డాయి. ముందుగా దీనికి చెక్కు తీసేసి, లోపల ఉన్న గింజలు కూడా తీసేసి ముక్కలు గా చేసి పెట్టుకోవాలి. తర్వాత మనకు కావలసినట్టు వండుకోవచ్చు.

ప్రస్తుతం నేను ఎర్ర గుమ్మడికాయ తో సాంబార్ చేసే విధానం వీడియో చేశాను. ఇందులో ఉల్లిపాయలు వాడలేదు. మా నానమ్మ, మేనత్త లు చేసే పద్దతి లో చేసాను.

వీడియో చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియో ల కోసం నా ఛానల్ కు సబ్స్క్రయిబ్ అవ్వండి.